AP High Court: అమరావతిలో అభివృద్ధి పనులపై వివరాలు ఇవ్వండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు ఆదేశం

AP High Court Ordered AP and Central Govt to file counters on Amaravathi
  • రాజధాని అభివృద్ధి పనులను ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసింది
  • హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు
  • దురుద్దేశంతోనే రాజధాని తరలింపు.. న్యాయవాదుల వాదనలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, హైకోర్టు తరలింపు వ్యవహారాలపై పూర్తి వివరాలను తెలియజేయాల్సిందిగా ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో పనుల కొనసాగింపు, హైకోర్టు తరలింపు వంటి పలు అంశాలపై దాఖలైన వివిధ కేసులపై నిన్న హైకోర్టు విచారణ జరిపింది.

అంతకుముందు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. రాజధాని పరిధిలోని అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని, వెంటనే వాటిని పునరుద్ధరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అలాగే, హైకోర్టు తరలింపు అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని, అమరావతిలో శాశ్వత హైకోర్టు నిర్మాణాలను కొనసాగించేలా ఆదేశించాలని కోరారు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో అభివృద్ధి పనుల్ని కొనసాగించాలని మరో న్యాయవాది అంబటి సుధాకరరావు కోరారు. నిబంధనలకు విరుద్ధంగా కమిటీలను ఏర్పాటు చేశారని, కారణం లేకుండానే రాజధానిలో అభివృద్ధి పనులను నిలిపివేశారని, తిరిగి పనులు కొనసాగించేలా ఆదేశించాలని న్యాయవాదులు మురళీధరరావు, ఎమ్మెస్ ప్రసాద్ కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ తన వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే రాజధానిని తరలిస్తోందని, ప్రభుత్వం మారినా విధానపరమైన నిర్ణయాలు మారడానికి వీల్లేదన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలను అంశాల వారీగా విభజించి విచారణ జరపడం మంచిదని పేర్కొంది. రాజధానికి నిధులు ఇచ్చినందున ఈ వ్యాజ్యాల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. అలాగే, పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, హైపవర్ కమిటీ నివేదికలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లోనూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీటికి సంబంధించిన వ్యాజ్యాల విచారణను వచ్చే నెల 30కి వాయిదా వేసింది.
AP High Court
Andhra Pradesh
Amaravati

More Telugu News