T20WorldCup: మంధాన రెడీ.. హ్యాట్రిక్‌పై భారత అమ్మాయిల గురి

  • టీ20 వరల్డ్‌కప్‌లో రేపు న్యూజిలాండ్ తో అమీతుమీ
  • గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ 
  • బరిలోకి స్మృతి మంధాన 
  • జోరుమీదున్న టీమిండియా
India seek hat trick of wins in clash against New Zealand

మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో వరుసగా రెండు విజయాలు సాధించి జోరుమీదున్న టీమిండియా హ్యాట్రిక్‌ విక్టరీపై కన్నేసింది. గ్రూప్–ఎలో భాగంగా గురువారం జరిగే తమ మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి హ్యాట్రిక్‌ కొట్టడంతో పాటు సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకోవాలని హర్మన్‌ప్రీత్‌ అండ్ కో భావిస్తోంది. మొదటి మ్యాచ్‌లోనే టైటిల్‌ ఫేవరెట్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన మన అమ్మాయిల జట్టు.. తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. దాంతో, నాలుగు పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేట్‌తో గ్రూప్‌లో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. కివీస్‌పై గెలిస్తే.. ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకోనుంది.

బలంగా భారత్‌

ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో మన జట్టు ఆకట్టుకుంది. బంగ్లాదేశ్ పై మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తాచాటిన యువ ఓపెనర్‌‌ షెఫాలీ వర్మ మంచి ఫామ్‌లో ఉంది. మరో యువ బ్యాటర్‌‌ జెమీమా రోడ్రిగ్స్‌ కూడా టచ్‌లో ఉండగా.. వైరల్‌ ఫీవర్‌‌ కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్‌‌ ఓపెనర్‌‌ స్మృతి మంధాన రాకతో భారత బ్యాటింగ్‌ మరింత బలంగా మారనుంది. మిడిలార్డర్‌‌లో వేదా కృష్ణమూర్తి, ఆల్‌రౌండర్‌‌ దీప్తి శర్మ ఉండనే ఉన్నారు. కెప్టెన్‌ హర్మన్‌ కూడా బ్యాట్‌కు పని చెప్పితే జట్టుకు తిరుగుండకపోవచ్చు.

బౌలింగ్‌లో అయితే టోర్నీలోనే మన జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. అద్భుతమైన స్పిన్‌తో పూనమ్‌ యాదవ్‌ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపెడుతోంది. పేసర్‌‌ శిఖా పాండే ఆమెకు మంచి సహకారం అందిస్తుండగా.. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి కూడా గత మ్యాచ్‌లో ఆకట్టుకుంది. ఈ ముగ్గురూ అదే జోరు కొనసాగిస్తే భారత్‌ గెలుపు సులభం కానుంది.

కివీస్ తక్కువేం కాదు

మరోవైపు న్యూజిలాండ్‌ కఠినమైన ప్రత్యర్థే. పైగా, భారత్‌తో ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టే గెలిచింది. కెప్టెన్, ఆల్‌రౌండర్‌‌ సోఫీ డివైన్, టాపార్డర్ బ్యాటర్‌‌ సుజీ బేట్స్, పేసర్ లియా తహుహు, లెగ్‌ స్పిన్నర్‌‌ అమెలియా కెర్‌‌ను ఎదుర్కోవడం అంత ఈజీగా కాదు. పైగా, శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కివీస్‌ ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. మరి, ఆ జట్టుకు కూడా చెక్‌ పెట్టి భారత అమ్మాయిలు సెమీస్ బెర్తు బుక్ చేసుకుంటారో లేదో చూడాలి.

More Telugu News