Mehbooba Muftis: ముఫ్తీ నిర్బంధంపై జమ్మూ కశ్మీర్​ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Supreme Court Notice To J K Administration Over Mehbooba Muftis Detention
  • జమ్మూ మాజీ సీఎంపై ప్రజా భద్రతా చట్టం కింద కేసు నమోదు
  • దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మెహబూబా ముఫ్తీ కూతురు
  • అధికారుల నుంచి వివరణ కోరిన అత్యున్నత న్యాయస్థానం 
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ నిర్బంధంపై వివరణ ఇవ్వాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబాను గృహ నిర్బంధం చేయడం, ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద కేసు నమోదు చేయడాన్ని ఆమె కుమార్తె ఇల్తిజా జావెద్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఆమె పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయం స్థానం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది. జమ్మూ కశ్మీర్‌‌కు కేంద్రం స్వయం ప్రతిపత్తిని తొలిగించిన తర్వాత మెహబూబాపై ఆరు నెలల గృహ నిర్బంధం విధించారు. అది ఈ నెల ఐదో తేదీతో ముగియడంతో  ఆమెపై పీఎస్ఏ ప్రయోగించారు. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా మరో మూడు నెలల నుంచి ఏడాది వరకు నిర్బంధంలో ఉంచొచ్చు.

అయితే, కుట్ర పూరితంగా తన తల్లిని నిర్బంధించారని ఇల్తిజా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఫ్తీపై పీఎస్‌ఏ విధించడానికి  ప్రభుత్వం చూపుతున్న కారణాలు కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. పచ్చ రంగులో ఉన్న పార్టీ జెండా, తండ్రి అడుగు జాడల్లో నడవడం, సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లను కారణంగా చూపారని తెలిపారు.

 ఆమె పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించి దీనిపై సమాధానం చెప్పాలని జమ్మూ కశ్మీర్ పాలకులను కోరింది. అలాగే, తన తల్లి నిర్బంధాన్ని సవాల్ చేస్తూ మరే కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయకూడదని ఇల్తిజా నుంచి ప్రమాణ పత్రం కోరింది. తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.
Mehbooba Muftis
Supreme Court
Detention
Jammu And Kashmir

More Telugu News