Botsa Satyanarayana: చంద్రబాబు దగ్గర ఉన్న వారే బీసీ నేతలా? మేము కాదా?: మంత్రి బొత్స

Minister Botsa comments on chandrababu
  • అధికారులపై ఏసీబీ దాడులు జరగడం సహజమే 
  • మాజీ సీఎంకు చెందిన మాజీ పీఎస్ నివాసంలో సోదాలు జరిగాయి
  • ఇలా జరగడం నా రాజకీయ జీవితంలో తొలిసారి చూశా
ఐటీ దాడులు సర్వసాధారణమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారులపై ఏసీబీ దాడులు జరగడం సహజమే కానీ, మాజీ సీఎం చంద్రబాబు మాజీ పీఎస్ నివాసంలోనూ జరిగాయని, ఇలాంటివి తన తన రాజకీయ జీవితంలో తొలిసారి చూశానని అన్నారు. ఐటీ సోదాలకు సమాధానం చెప్పిన తర్వాత చంద్రబాబు తన యాత్రలు చేస్తే బాగుంటుందని సెటైర్లు విసిరారు. అమరావతి పేరిట దోపిడీ జరిగిందని ఏడు నెలల క్రితమే గుర్తించామని, భూ సేకరణలో అవకతవకలు జరిగాయని అప్పుడే చెప్పామని అన్నారు.

ఈ అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తిచూపితే తప్పని అనడం కరెక్టు కాదని అన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన బీసీలను తాము లక్ష్యంగా చేసుకున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘నేనూ బీసీ మంత్రినే.. గతంలో పదేళ్లు మంత్రిగా పని చేశాను. చంద్రబాబు దగ్గర ఉన్న వారే బీసీ నేతలా? మేము కాదా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని, అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరని అన్నారు.

విజయనగరం జిల్లాలో 58 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఉగాది నాటికి స్థలాల పంపిణీకి అవసరమైన స్థల సేకరణ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా బలవంతపు భూ సేకరణ జరగలేదని, పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.
Botsa Satyanarayana
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News