Kambala: నాకు నెల రోజుల సమయం కావాలి: కంబళ వీరుడు శ్రీనివాస గౌడ

Kambala fame Srinivasa Gowda seeks one month time
  • కంబళ పోటీల్లో చిరుతలా పరుగులు తీసిన గౌడ
  • 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పూర్తి
  • గౌడకు ట్రయల్స్ నిర్వహించాలని కోచ్ లను ఆదేశించిన కేంద్రమంత్రి
  • ప్రస్తుతం కంబళ పోటీల్లో పాల్గొనడంపైనే దృష్టి పెట్టానన్న గౌడ
సంప్రదాయ కంబళ పోటీల్లో దున్నపోతులతో సమంగా పరుగులు తీసిన కన్నడ వీరుడు శ్రీనివాస గౌడ పేరు మార్మోగిపోతోంది. 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలోనే అధిగమించడమే అందుకు కారణం. పరుగుల చిరుతగా పేరుగాంచిన ఉసేన్ బోల్ట్ సాధించిన వరల్డ్ రికార్డ్ టైమింగ్ 9.58 సెకన్లు కాగా, గౌడ 0.3 సెకన్ల తేడాతో బోల్ట్ ను అధిగమించాడు.

ఈ కన్నడ యువకుడి స్పీడ్ చూసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ లు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అయితే దిగ్భ్రాంతి చెందారు. సంప్రదాయ పోటీల్లో పాల్గొనే ఓ యువకుడు జారిపోయే బురదలో సైతం చిరుతను తలపించేలా పరిగెత్తడం ఆయనను విస్మయానికి గురిచేసింది. దాంతో, శ్రీనివాస గౌడకు ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా సాయ్ కోచ్ లను ఆదేశించారు. అయితే, తనకు నెల సమయం కావాలని గౌడ తెలిపాడు. ప్రస్తుతం కంబళ టోర్నమెంట్ జరుగుతోందని, అక్కడ మరిన్ని విజయాలు సాధించాలనుకుంటున్నానని తెలిపాడు.

అయితే. రన్నింగ్ ట్రాక్ కు, కంబళ ట్రాక్ కు చాలా తేడా ఉంటుందని, రన్నింగ్ ట్రాక్ లో వేళ్లమీద పరిగెడితే, బురదతో నిండిన కంబళ ట్రాక్ లో జారిపోకుండా మడమలపై పరిగెడతామని వివరించాడు. తనకు అంత పేరు తెచ్చిన పరుగులో వాస్తవానికి దున్నపోతులదే కీలకపాత్ర అని వినమ్రంగా వెల్లడించాడు. ఉసేన్ బోల్ట్ తో తనను పోల్చడంపైనా శ్రీనివాస గౌడ స్పందించాడు. బోల్ట్ ప్రపంచ విజేత అని, తాను పంటపొలాల్లో, బురద నేలల్లో పరిగెత్తే వ్యక్తినని పేర్కొన్నాడు.
Kambala
Srinivasa Gowda
Usain Bolt
SAI
Kiran Rijiju

More Telugu News