Kurnool District: దెయ్యం ఉందంటూ ఊదరగొట్టారు: సచివాలయం మార్పునకు భలే ఐడియా!

devils story created for sachivalayam shifting
  • బస్టాండ్ కు దూరం కావడంతో తరలించాలన్న సిబ్బంది 
  • వీలుకాదన్న ఉన్నతాధికారులు
  • ఇంతలో సిబ్బంది ఒకరు చనిపోవడంతో దెయ్యం కథ

బస్టాండ్ కు దూరంలో ఉన్న వార్డు కార్యాలయాన్ని మార్చాలని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ససేమిరా అనడంతో దెయ్యం కథ అల్లి తమ మాట నెగ్గించుకున్నారు కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓ సచివాలయం సిబ్బంది. 

వివరాల్లోకి వెళితే....కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని 14వ వార్డు కార్యాలయం హాజీనగర్ కాలనీలో ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలోని 12, 13, 14 వార్డుల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఇక్కడ పెట్టారు.

ఈ కార్యాలయం బస్టాండ్ నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉంది. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులంతా కర్నూలు నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్ దూరం కావడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతోందని, సమీపంలోకి కార్యాలయాన్ని మార్చాలని అధికారులను కోరారు. వారు వీలుకాదని తేల్చిచెప్పేశారు.

ఏం చెయ్యాలా? అని ఆలోచిస్తుండగా వార్డులో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఈనెల 9వ తేదీన గుండెపోటుతో చనిపోయాడు. అంతే.. దెయ్యం కథ అల్లేశారని సమాచారం. కార్యాలయంలో ఏదో ఆకారం కదులుతూ కనిపిస్తోందని, తమకు భయం వేస్తోందంటూ వీరు అధికారుల వద్ద వాపోవడంతో  ఉన్నతాధికారులు కార్యాలయం మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

మూడురోజుల నుంచి  కార్యాలయం శివశంకర్ టాకీస్ పక్కకు మార్చినట్లు బోర్డు వేలాడుతుండడంతో స్థానికులు దెయ్యం కథపై చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ అంకిరెడ్డి వద్ద ప్రస్తావించగా దెయ్యం, భూతం కథలేవీ తమ దృష్టికి రాలేదని చెప్పారు. అక్కడి వార్డు సచివాలయం మేడపై ఉండడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది తెలియజేయడంతో మార్పునకు అంగీకరించినట్లు చెప్పారు. కానీ స్థానికులు మాత్రం కార్యాలయం తరలింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Kurnool District
nandikotkooru
sachivalayam
devils story

More Telugu News