Jagan: రైతు భరోసా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన సీఎం జగన్

CM Jagan conducts review over government programs
  • స్పందన కార్యక్రమంపై అధికారులతో సీఎం సమీక్ష
  • ఈ నెల 15 నుంచి బియ్యం కార్డుల పంపిణీ
  • మార్చి 31 నాటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తిచేయాలని ఆదేశాలు
రాష్ట్రంలో స్పందన కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు భరోసా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న 21,750 దరఖాస్తులను పరిష్కరించి డబ్బు అందించాలని స్పష్టం చేశారు. అమ్మఒడి పథకం ద్వారా 42.33 లక్షల మందికి డబ్బు చెల్లించామని చెప్పారు. కొత్తగా 6,14,244 మందికి పెన్షన్లు ఇచ్చామని, కలెక్టర్లు ఈ నెల 17 నాటికి పెన్షన్ల రీవెరిఫికేషన్ పూర్తిచేయాలని తెలిపారు. పరిశీలించాక అర్హత ఉందని తేలితేనే రెండు నెలల పెన్షన్ ఒకేసారి చెల్లిస్తామని సీఎం జగన్ వివరించారు.

బియ్యం కార్డుల విషయంలోనూ రీవెరిఫికేషన్ పూర్తిచేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి బియ్యం కార్డుల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు. అదేరోజున కడప, కర్నూలు, విశాఖ, శ్రీకాకుళంలో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మార్చి 7 నుంచి చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల్లో, మార్చి 25 నుంచి ప్రకాశం, గుంటూరు, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ఉంటుందని వివరించారు.

మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తిచేస్తామని చెప్పారు. అయితే, 1.41 కోట్ల మందికి క్యూఆర్ కోడ్ కార్డులు ఇవ్వాల్సి ఉండడంతో కాస్త ఆలస్యం అయిందని సీఎం వివరణ ఇచ్చారు. తాము రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు.
Jagan
Rythu Bharosa
Andhra Pradesh
YSRCP

More Telugu News