Gorantla Butchaiah Chowdary: ‘ఈ పీడ ఎప్పుడు విరగడవుతుంది?’ అని రెడ్ల కుర్రాళ్లు నన్ను ప్రశ్నించారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

 Butchaiah Chowdary says some Reddy guys asked him when this government goes away
  • తాడేపల్లిలోని ఓ హోటల్ లో టిఫిన్ కు మొన్న వెళ్లాను
  • ‘మీరేగా ఓట్లేసి గెలిపించారు’ అని బదులిచ్చా
  • ‘లెంపలేసుకుంటున్నాం’ అని ఆ కుర్రాళ్లు ఆవేదన చెందారు
రాజధానిని తరలిస్తారన్న విషయంలో వైసీపీలో కొద్ది మందికి తప్ప మిగిలిన వాళ్లకు బాధగానే వుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరులో రైతులకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయం గురించి చెప్పారు. తాడేపల్లిలోని ఓ హోటల్ లో టిఫిన్ చేసేందుకు ఇటీవల తాను వెళ్లానని, ఆ హోటల్ రెడ్డి కులస్తులదని చెప్పారు. తాను టిఫిన్ చేస్తుండగా ఏడెనిమిది మంది రెడ్ల కుర్రాళ్లు వచ్చి తన చుట్టూ కూర్చున్నారని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా తనతో వారు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ‘అన్నయ్యా, ఈ పీడ ఎప్పుడు విరగడవుతుంది?’ అని తనను ప్రశ్నించారని చెప్పారు. ‘ఇదేంటయ్యా, మీరేగా ఓట్లేసి గెలిపించారు’ అని తాను బదులిచ్చానని అన్నారు. ‘అన్నా, వేశాం (ఓట్లు) లెంపలేసుకుంటున్నాం. ఈ తాడేపల్లి అంతా నాశనం. కనకదుర్గమ్మ వారథి నుంచి కాకాని దాకా వేల అపార్టుమెంట్లు కట్టి దివాళా తీసే పరిస్థితి వచ్చింది.. చంద్రబాబుగారితో చెప్పి ఫైట్ చేయండి’ అని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేసుకున్నారు.

‘ఆయుధం వాళ్లకు ఇచ్చి మమ్మల్ని ఫైట్ చేయమంటారేంటి?’ అని తాను ప్రశ్నించగా, ‘లేదన్నా’ అంటూ వైసీపీకి ఒకసారి అవకాశం ఇచ్చామని చెప్పారని చెప్పుకొచ్చారు.
Gorantla Butchaiah Chowdary
Telugudesam
YSRCP

More Telugu News