Ravishanker: ఇంటర్నెట్ వాడకం ప్రజల హక్కేమీ కాదు: కేంద్ర మంత్రి రవిశంకర్ కీలక వ్యాఖ్యలు!

  • ఇంటర్నెట్ కన్నా దేశ భద్రతే ముఖ్యం
  • అభిప్రాయాలు పంచుకోవడం భావవ్యక్తీకరణలో భాగమే
  • కశ్మీర్ ప్రాంతంలో ఇంటర్నెట్ ను దుర్వినియోగం చేస్తున్న పాక్
  • రాజ్యసభలో ఐటీ, న్యాయ మంత్రి రవిశంకర్

ఇంటర్నెట్ వాడకం తమకున్న ఓ హక్కని ప్రజల్లో ఉన్న భావనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ తో పాటు దేశ భద్రత చాలా ముఖ్యమైన విషయమన్న సంగతి గుర్తెరగాలని అన్నారు. ఇంటర్నెట్ ద్వారా అభిప్రాయాలు పంచుకోవడం భావ వ్యక్తీకరణ హక్కులో ఓ భాగం మాత్రమేనని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని, ఈ విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన రవిశంకర్, కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపచేసేందుకు పాకిస్థాన్, ఇంటర్నెట్ ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

అంతకుముందు రాజ్యసభలో విపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ వేసిన అనుబంధ ప్రశ్నకు రవిశంకర్ సమాధానం ఇచ్చారు. "మీరు కశ్మీర్ కు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీరు కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నారు. కశ్మీర్ లో ఇంటర్నెట్ దుర్వినియోగం అవుతోందని మీకు కూడా తెలుసు. ఆంక్షలను సడలించేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీలు పని చేస్తున్నాయి. కశ్మీర్ లో ప్రభుత్వ వెబ్ సైట్లతో పాటు బ్యాంకింగ్, పర్యాటకం, రవాణా, విద్యా రంగాలకు సంబంధించిన 783 వెబ్ సైట్లన్నీ పని చేస్తూనే ఉన్నాయి" అని రవిశంకర్ వ్యాఖ్యానించారు.

More Telugu News