Narendra Modi: ఎక్కువ ట్యూబ్ లైట్లు ఇలానే ఉంటాయి: రాహుల్ పై మోదీ విమర్శలు

  • మోదీ ప్రసంగిస్తుండగా అడ్డు తగిలిన రాహుల్
  • కరెంట్ అక్కడకు చేరడానికి చాలా సమయం పట్టిందని మోదీ ఎద్దేవా
  • ప్రసంగాల సమయంలో కూడా అధిర్ వ్యాయామం చేస్తున్నారంటూ వ్యాఖ్య
లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. తాను ప్రసంగిస్తుండగా అడ్డు తగిలిన రాహుల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, తన ప్రసంగం ప్రారంభమై 30 నుంచి 40 నిమిషాలు అవుతోందని... అయితే కరెంట్ అక్కడకు చేరడానికి చాలా సమయం పట్టినట్టుందని, ఎక్కువ ట్యూబ్ లైట్లు ఇలాగే ఉంటాయని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వాల మాదిరే తాము కూడా పని చేసి ఉంటే... రామ జన్మభూమి వివాదం పరిష్కారమయ్యేది కాదని, కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణమయ్యేది కాదని, భారత్-బంగ్లాదేశ్ ల మధ్య ల్యాండ్ అగ్రిమెంట్ జరిగి ఉండేది కాదని మోదీ అన్నారు. సమస్యల పరిష్కారంలో భారత్ ఇకపై వేచిచూసే ధోరణిని ఏమాత్రం అవలంబించబోదని చెప్పారు. వేగం, పట్టుదల, నిర్ణయాత్మకమైన ధోరణి, పరిష్కారం ఇవే తమ సూత్రాలు అని అన్నారు.

తన ప్రసంగం మధ్యలో లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదురిపై మోదీ సెటైర్లు వేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో అధిర్ కూడా భాగస్వామి అయ్యారని, ఆయనను తాను అభినందిస్తున్నానని... అయితే, ప్రసంగాల సమయంలో కూడా శరీరాన్ని కదిలిస్తూ అధిర్ వ్యాయామం చేస్తున్నారని దెప్పిపొడిచారు.
Narendra Modi
BJP
Rahul Gandhi
Congress
Lok Sabha

More Telugu News