Pawan Kalyan: ఇప్పటికే అమరావతి రైతులు రోడ్డునపడ్డారు, ఇక విశాఖ రైతుల వంతు!: పవన్ కల్యాణ్

  • ఉత్తరాంధ్ర జనసేన నేతలతో పవన్ సమావేశం
  • విశాఖ పేదరైతులకు ప్రభుత్వం అన్యాయం చేసేందుకు సిద్ధమైందని ఆరోపణ
  • భూసమీకరణ ముసుగులో ఏం జరుగుతోందో గమనించాలని నేతలకు సూచన
ఏపీ రాజధానిగా విశాఖపట్నం నగరాన్ని రూపుదిద్దాలని వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో, ఉత్తరాంధ్ర జనసేన నేతలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అమరావతి రైతులు రోడ్డునపడ్డారని, ఇప్పుడు విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల 10 మండలాల్లో భూసేకరణ చేపట్టారని ఆరోపించారు.

అసైన్డ్ భూములను తిరిగి తీసుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం పేదరైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఇదే జరిగితే ఎక్కువగా నష్టపోయేది ఎస్సీ, ఎస్టీ రైతులేనని పవన్ అభిప్రాయపడ్డారు. సుమారు 6 వేల ఎకరాల మేర అసైన్డ్ భూములను వెనక్కి తీసుకోబోతున్నారని, దీనిపై రైతుల్లో ఉన్న భయాందోళనలను గుర్తించి జనసేన పార్టీ వారికి అండగా నిలవాలని నేతలకు స్పష్టం చేశారు.

భూసమీకరణ కోసం  గ్రామసభలు నిర్వహిస్తున్న తీరును జనసేన నాయకులు నిశితంగా గమనిస్తుండాలని తెలిపారు. విశాఖలో పేద రైతులకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అలాంటి హామీలనే అమరావతిలో ఎలా ఉల్లంఘించారు? అనే అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్యంగా, ఈ భూసమీకరణ ముసుగులో ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయో గుర్తించాలని పవన్ స్పష్టం చేశారు. అమరావతి రైతుల దుస్థితి ఉత్తరాంధ్ర రైతులకు రాకుండా చూడాలని నిర్దేశించారు.
Pawan Kalyan
Janasena
Amaravati
Visakhapatnam
Farmers

More Telugu News