Nirbhaya: నిర్భయ దోషుల ఉరి అమలుపై స్టే యథాతథం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిటిషన్ల కొట్టివేత

  • న్యాయ హక్కులు వినియోగించుకునేందుకు నిర్భయ దోషులకు అవకాశం
  • దోషులకు వారం సమయం ఇచ్చామన్న హైకోర్టు
  • అప్పటివరకు స్టే ఎత్తివేయలేమని స్పష్టీకరణ
నిర్భయ దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకునే హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిర్భయ దోషుల ఉరితీతపై విధించిన స్టే ఎత్తివేయలేమని తెలిపింది. స్టే తొలగించాలంటూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. నిర్భయ దోషులకు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునేందుకు వారం రోజుల సమయం ఇచ్చామని, ఆ గడువు ముగిసిన తర్వాతే వారి ఉరితీతకు సంబంధించిన విచారణ షురూ అవుతుందని న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు సదరు పిటిషన్లను కొట్టివేసింది.

అటు, నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ కు అన్ని అవకాశాలు ముగిశాయి. అతడి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్లకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా విఫలమైంది. మరోవైపు అక్షయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. దానిపై నిర్ణయం వస్తే నిర్భయ దోషులు ఉరి అమలుపై స్పష్టత రానుంది.
Nirbhaya
Stay
High Court
Petition
NDA

More Telugu News