Maharashtra: మహారాష్ట్రలో దారుణం.. ప్రేమించలేదని కాలేజీ లెక్చరర్‌పై పెట్రోలు పోసి నిప్పంటించిన యువకుడు!

  • కాలేజీ బయట యువతితో వాగ్వివాదం
  • నడిరోడ్డుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టిన వైనం
  • తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర సర్కారు
ప్రేమ పేరుతో మరో దారుణం జరిగింది.  తనకు పెళ్లై, పిల్లాడు ఉన్నప్పటికీ ఓ యువతిని వేధించిన యువకుడు.. తనను దూరం పెట్టిందన్న కసితో కాలేజీ లెక్చరర్‌పై పట్టపగలు పెట్రోలు పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మహారాష్ట్రలోని వాద్రాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. దడోరా గ్రామానికి చెందిన అంకిత పిసుద్దె (25) విదర్భలోని హింఘన్‌ఘాట్ జిల్లా నందోరీ చౌక్‌లోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. దడోరా గ్రామానికే చెందిన వికేశ్ (27)కు పెళ్లయింది. ఏడు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అంకితతో తనకున్న పరిచయాన్ని అడ్డంపెట్టుకుని ప్రేమించమని వెంటపడేవాడు. అతడి ప్రవర్తన నచ్చని అంకిత రెండేళ్ల క్రితం అతడిని దూరం పెట్టింది.

అంకిత తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన వికేశ్ నిన్న ఉదయం కళాశాల వద్ద కాపుకాశాడు. అంకిత బయటకు రాగానే ఆమెతో గొడవకు దిగాడు. అది మరింత ముదరడంతో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై చల్లి నిప్పంటించాడు. స్థానికులు అప్రమత్తమయ్యేలోగానే బైక్‌పై పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అంకితను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.

ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. వివాహమైనా వికేశ్ వేధింపులు ఆపలేదని, గతేడాది ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు. వికేశ్ కారణంగా అంకిత వివాహ జీవితం ఇబ్బందుల్లో పడినట్టు ఆమె బంధువులు తెలిపారు.
Maharashtra
love
murder
petrol
Crime News

More Telugu News