Swara Bhaskar: పాకిస్థాన్ తో ప్రేమలో ఉంది.. మాలాంటి వారిని లాఠీలతో కొడుతున్నారు: బీజేపీపై సినీ నటి స్వర భాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు

  • పాకిస్థాన్ కు చెందిన అద్నాన్ సమీకి పద్మశ్రీ ఇచ్చారు
  • పౌరసత్వ చట్టానికి విలువ ఎక్కడుంది?
  • అక్రమ వలసదారులు బీజేపీ మనసులోకి ప్రవేశించారు
భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వంపై సినీ నటి స్వర భాస్కర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన 'రాజ్యాంగాన్ని కాపాడండి... దేశాన్ని రక్షించండి' అనే ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ... బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగాన్ని వంచించడమేనని అన్నారు.

శరణార్థులకు పౌరసత్వాన్ని ఇవ్వడం, అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని అరెస్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోందని చెప్పారు. అద్నాన్ సమీకి పౌరసత్వాన్ని ఇవ్వడమే కాకుండా, అతనికి మీరు పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చారని... ఈ నేపథ్యంలో, సీఏఏకు విలువ ఎక్కడుందని ప్రశ్నించారు.

ఓవైపు సీఏఏను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన తమలాంటి వారిని లాఠీలతో కొడుతున్నారని, బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్నారని... మరోవైపు పాకిస్థాన్ జాతీయులకు పద్మశ్రీ ఇస్తున్నారని స్వర భాస్కర్ మండిపడ్డారు. అక్రమ వలసదారులు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మనసుల్లోకి ప్రవేశించారని అన్నారు. తమ అమ్మమ్మ హనుమాన్ చాలీసా పఠించేదాని కంటే ఎక్కువ సార్లు కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ మంత్రాన్ని జపిస్తుందని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ తో బీజేపీ ప్రేమలో ఉందని అన్నారు.

నాగపూర్ లో కూర్చొన్న పెద్దలు అక్కడి నుంచి విద్వేషపూరిత రాజకీయాలను విస్తరింపజేేస్తున్నారని పరోక్షంగా ఆరెస్సెస్ పై స్వర భాస్కర్ విమర్శలు గుప్పించింది. పాకిస్థాన్ జాతిపిత జిన్నా ఎప్పుడో చనిపోయారని... కానీ, అతని నుంచి స్ఫూర్తిని పొందినవారు మతం పేరుతో మరోసారి దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
Swara Bhaskar
Bollywood
Adnan Sami
Padma Shri
CAA
BJP

More Telugu News