Pawan Kalyan: అలాంటి సొమ్ముతో పిల్లల స్కూలు ఫీజలు కట్టలేను: పవన్ కల్యాణ్

  • సినిమాలంటే మోజు లేదని వెల్లడి
  • కుటుంబ పోషణ కోసమే సినిమాలన్న జనసేనాని
  • వ్యక్తిగత లాభం చూసుకోవడం లేదని వివరణ
పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ వివరంగా స్పందించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసైనికులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో అక్రమంగా సంపాదించి కుటుంబాన్ని పోషించలేనని, అలాంటి డబ్బుతో పిల్లలకు స్కూలు ఫీజలు కూడా కట్టలేనని స్పష్టం చేశారు. తనకేమీ సినిమాలంటే మోజు లేదని, కానీ పార్టీ కోసం, తనపై ఆధారపడిన కుటుంబాల కోసం, తన కుటుంబం కోసం సినిమాలు చేస్తున్నానని వెల్లడించారు.

"నన్ను నేను మోసం చేసుకోలేను. వ్యక్తిగత లాభం చూసుకుని ఉంటే జనసేన పార్టీ స్థాపించాల్సిన అవసరమే ఉండేది కాదు. కొందరు ఎన్నికలప్పుడు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి ఇప్పుడు నా పద్ధతులు బాగాలేవని వెళ్లిపోతున్నారు. అలాంటి వాళ్ల మాటలకు పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరంలేదు. ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నవాళ్లెవరూ పార్టీ స్థాపించినప్పుడు లేరు. జనసేనను ఓ ముడిసరుకుగా ఉపయోగించుకుని ఎదగాలని వచ్చేవాళ్లకు నేను అర్థం కాను. అలాంటి వాళ్లు ఏమనుకున్నా నాకు అనవసరం" అంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు.
Pawan Kalyan
Janasena
Vijayawada
VV Lakshminarayana
CBI

More Telugu News