Hyderabad: డ్యూటీకి వెళుతున్నానని ఇంటి నుంచి వెళ్లి.. ఉరివేసుకున్న యువకుడు

  • లాడ్జ్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉరివేసుకున్న వైనం
  • ఫైనాన్స్ కంపెనీ అధికారి వేధింపులే కారణమన్న భార్య
  • హైదరాబాద్‌లోని నాగోలులో ఘటన
విధులకు వెళ్లిన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులోని ఫతుల్లాగూడకు చెందిన వరికుప్పల సైదులు (29) భార్య మాధవి, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్ పరిధిలోని శాంతినగర్‌లో ఉంటున్నాడు. ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంటుగా పనిచేసే సైదులు.. గత నెల 29న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం 1:30 గంటలకు భార్యకు ఫోన్ చేసి కోఠి బ్యాంకులో ఉన్నానని, డబ్బులు జమచేసి వస్తానని చెప్పాడు.

అలా చెప్పిన వ్యక్తి రాత్రయినా ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో ఆందోళన చెందిన మాధవి తర్వాతి రోజు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పరికిబస్తీలో ఉన్న కేకే లాడ్జ్‌లో 30న గదిని అద్దెకు తీసుకున్న సైదులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న గదిని అద్దెకు తీసుకున్న సైదులు నిన్న ఉదయం వరకు తలుపు తీయకపోవడంతో అనుమానించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. లోపల సైదులు ఉరికి వేలాడుతూ కనిపించాడు.

ఫ్లైట్ మోడ్‌లో ఉన్న అతడి ఫోన్‌ను గమనించిన పోలీసులు ఇన్‌కమింగ్ కాల్స్‌ను పరిశీలించి మాధవికి సమాచారం అందించారు. విషయం తెలిసిన ఆమె కన్నీరుమున్నీరు అయింది. ఫైనాన్స్ కంపెనీ అధికారి వేధింపులే తన భర్త ఆత్మహత్యకు కారణమని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Nagole
Crime News

More Telugu News