YSRCP: ఇలా ఊరుకుంటే చంద్రబాబు లాంటి పొలిటికల్ క్రిమినల్స్ ఎంతకైనా దిగజారతారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అవమానం జరిగింది
  • మొన్న మండలిలో పరిణామాలే ఇందుకు నిదర్శనం
  • ఇలా అవమానించడాన్ని చూస్తూ ఊరుకోకూడదు
ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి తన మద్దతు తెలుపుతున్నానని వైసీపీ సభ్యురాలు రోజా అన్నారు. మండలి రద్దు తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కౌన్సిల్ కు పంపిస్తే అక్కడ అవమానించడం దారుణమని అన్నారు. ఇలా అవమానించడాన్ని చూస్తూ ఊరుకుంటూ పోతే, చంద్రబాబు లాంటి పొలిటికల్ క్రిమినల్స్ ఎంతకైనా దిగజారతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొన్న మండలిలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
 
అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని, అభివృద్ధి సమానంగా ఉండాలని మన రాజ్యాంగం సూచిస్తుందని చెప్పారు. గతంలో ఎవరూ చేయని ప్రయత్నం సీఎం జగన్ చేశారని, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, అందుకు సంబంధించిన బిల్లును తీసుకొచ్చారని అన్నారు. తరతరాలుగా వెనుబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తీర్చేందుకు ‘ఇన్నాళ్లకు ఒకడొచ్చాడు’ అని అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు.

జగన్ సీఎం అయిన తర్వాత దాదాపు 30 బిల్లులను తీసుకొచ్చారని, మూడు ప్రాంతాల ప్రజల కలలను సాకారం చేసే వ్యక్తి జగన్ అని అభినందిస్తున్నారని రోజా అన్నారు. ‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేయగలడు’ అని ప్రజలు అంటున్నారని, తన పాదయాత్రలో జగన్ తన కాళ్లకు, శరీరానికి అయిన గాయాలను అన్నింటినీ మర్చిపోయి, ప్రజలకు అయిన గాయాలు తెలుసుకుని వాళ్లు కోరుకున్న దానికి అనుగుణంగా చేయాలని చెప్పి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, తీసుకొస్తున్న చట్టాలను చూసి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.
YSRCP
Roja
mla
Chandrababu
Telugudesam

More Telugu News