Bike Riders: బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తికీ హెల్మెట్ తప్పనిసరి... హైదరాబాద్ లో ఇక అమలులోకి!

  • గత సంవత్సరం 128 మంది మృతి
  • అందరూ హెల్మెట్ లేకుండా వెనకున్న వారే
  • తొలితప్పుగా రూ. 100 జరిమానా వేస్తున్న రాచకొండ పోలీసులు
  • బైకర్లకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సైబరాబాద్ అధికారులు
గత సంవత్సరం సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ ల పరిధిలో బైక్ లపై వెనకాల హెల్మెట్ లేకుండా కూర్చుని, ఆపై ప్రమాదాల్లో 128 మంది మరణించడంతో, పోలీసు ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. బైక్ పై వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ను తప్పనిసరి చేశారు. ఇప్పటికే రాచకొండ పరిధిలో ఈ నిబంధనను గత 15 రోజుల నుంచి అమలు చేస్తూ, హెల్మెట్ లేని 328 మందికి తొలి తప్పుగా రూ. 100 చొప్పున ఫైన్ వేశారు.

ఓ వైపు మునిసిపల్ ఎన్నికలు, మరోవైపు వాహనదారులకు ఈ విషయంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో, ఇంతవరకూ హెల్మెట్ నిబంధనను చూసీ చూడనట్టు వదిలేశామని, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. హెల్మెట్ విషయంలో పోలీసులకూ మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఇక సైబరాబాద్ పరిధిలో ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరి నిబంధన ఇంతవరకూ అమలులో లేదు. రాచకొండ పోలీసులు పాటిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసిన సైబరాబాద్ అధికారులు, తొలుతే జరిమానాలు వేస్తే, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించి, తొలుత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హెల్మెట్ లేకుండా వెనుక కూర్చుంటే, తొలుత హెచ్చరించి వదిలేస్తామని, అదే తప్పు మరోసారి చేస్తే, జరిమానా తప్పదని అన్నారు. సోషల్ మీడియాలో హెల్మెట్ నిబంధన అమలుపై విస్తృతంగా ప్రచారాన్ని ప్రారంభించామని అధికారులు తెలిపారు. 
Bike Riders
Helmet
Pillion
Rachakonda
Cyberabad
Police

More Telugu News