Rajanikant: రజనీకాంత్ ను హత్య చేస్తామని బెదిరింపులు!

  • పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు
  • క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన రజనీ
  • బెదిరింపులపై కేసు నమోదు
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ను హత్య చేస్తామన్న బెదిరింపులు రావడంతో, పోలీసు కేసు నమోదైంది. ఇటీవల ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ, ద్రావిడులు అమితంగా ప్రేమించే పెరియార్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా 1971లో ఆందోళనలు చేపట్టిన పెరియార్, ఆ సమయంలో హిందూ దేవుళ్లను అవమానించేలా ప్రవర్తించారని రజనీ అనడం, ద్రావిడ వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది.

రజనీకాంత్ క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేయగా, ఆయన ససేమిరా అన్నారు. తాను పుస్తకాల్లో చదువుకున్న విషయాన్ని మాత్రమే చెప్పానని, క్షమాపణలు కోరేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హత్యా బెదిరింపులు వస్తున్నాయంటూ సినోరా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది. 22వ తేదీన తేనాంపేటలో నిరసనలకు దిగిన డ్రావిడ విడుదలై కళిగం నేత ఉమాపతి, రజనీకాంత్ ను ప్రాణాలతో ఉండనివ్వబోమని హెచ్చరించారని గుర్తు చేశారు. కాగా, కేసును విచారిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Rajanikant
Murder
Police
Case

More Telugu News