KCR: స్థానిక ఎన్నికల్లో ఇలాంటి ఘనవిజయం ఏ పార్టీకీ దొరకదు: సీఎం కేసీఆర్

  • మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం
  • తెలంగాణ భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్
  • ఇది మామూలు విజయం కాదని వ్యాఖ్యలు
తెలంగాణ పురపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘనవిజయం ఏ పార్టీకి దొరకదని, ఇది మామూలు విషయం కాదని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో భిన్నమైన ఓటర్లు ఉంటారని, వారు కూడా ఈసారి ఏకపక్షంగా ఓట్లేశారని తెలిపారు.

డిసెంబరులో తాను అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళుతుంటే అనేక వ్యాఖ్యలు చేశారని, కానీ 88 సీట్లు గెలిచామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ తమదే ఆధిపత్యం అని వెల్లడించారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ అదే తీరు కొనసాగిందని, 32 జిల్లా పరిషత్ లు ఉంటే ఆ 32 కూడా టీఆర్ఎస్ కే దక్కడం దేశంలోనే ఎక్కడా లేదని వివరించారు.

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తమను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు విశ్వప్రయత్నాలు చేశారని, కోర్టుల చుట్టూ తిరిగారని ఆరోపించారు. ఎన్నికలు పూర్తయితే అభివృద్ధి పనులు కొనసాగించవచ్చని తాము భావిస్తే, ఎలాగైనా ఎన్నికలు ఆపాలని విపక్షాలు పనిచేశాయని మండిపడ్డారు. అనేక అవాంతరాలను అధిగమించి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ముక్తకంఠంతో తీర్పు చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు.
KCR
Municipal Elections
TRS
Telangana
Congress
BJP

More Telugu News