Andhra Pradesh: అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారం: మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణతో పాటు పలువురు నేతలపై కేసు నమోదు

  • వెంకట పాలేనికి చెందిన పోతురాజు బుజ్జమ్మ అనే వ్యక్తి ఫిర్యాదు
  • 99 సెంట్ల అసైన్డ్ భూమిని కొన్న టీడీపీ నేతలు?
  • బెల్లంకొండ నరసింహారావుపై కూడా సీఐడీ కేసు నమోదు 
అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. తమ భూములను బెదిరించి లాక్కున్నారంటూ రాష్ట్ర మాజీ మంత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. వెంకట పాలేనికి చెందిన పోతురాజు బుజ్జమ్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ చర్యలు తీసుకుంటోంది.

తనకు చెందిన 99 సెంట్ల అసైన్డ్ భూమిని టీడీపీ నేతలు కొన్నారని బుజ్జమ్మ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, బెల్లంకొండ నరసింహారావులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ 420, 506, 120 బీ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదైనట్లు తెలిసింది. అయితే, ఈ కేసులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, కొందరు తాడికొండ, తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరిలో ఎకరాల కొద్దీ భూములు కొన్నట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. తనపై కేసు నమోదు చేసిన విషయాన్ని గురించి తెలుసుకున్న ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ... కక్షతోనే తమపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
Andhra Pradesh
Amaravati
narayana

More Telugu News