Andhra Pradesh: నిన్నటి హీరో మండలి చైర్మన్ షరీఫ్... అమరావతి ప్రజల పాలాభిషేకం!

  • మండలిలో ఆగిన మూడు రాజధానుల బిల్లు
  • తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్న షరీఫ్
  • షరీఫ్ రుణం తీర్చుకోలేమంటున్న రాజధాని రైతులు
సభ్యుల పరంగా తమకు సంఖ్యా బలం లేని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏమీ చేయలేకపోయిన తెలుగుదేశం పార్టీ, బలమున్న మండలిలో సత్తా చాటుతూ, మూడు రాజధానుల బిల్లును సమర్థవంతంగా అడ్డుకుని, పంతాన్ని నెగ్గించుకుంది.

ఇప్పటికిప్పుడు మూడు రాజధానుల అమలు సాధ్యమయ్యే పరిస్థితి లేదని తేలడంతో నిన్న రాత్రి మండలి నుంచి, తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబుకు అడుగడుగునా అమరావతి ప్రజలు స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం వెనుక, నిబంధనలకు కట్టుబడి, తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్న మండలి చైర్మన్ షరీఫ్ పాత్ర ఎంతో ఉందని రైతులు అంటున్నారు.

మండలిలో బిల్లు ఆమోదం పొందలేదని తేలిన వెంటనే పలు ప్రాంతాల్లో షరీఫ్ పోస్టర్లకు రైతులు, జేఏసీ నాయకులు పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతగా ప్రలోభాలు పెట్టినా, తన ధర్మానికి ఆయన కట్టుబడివున్నారని అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు.

"అధర్మం రాజ్యమేలుతున్న సమయంలో అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొని ధర్మాన్ని నిలబెట్టటంలో మీ పాత్ర, తీర్పు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ ఆదర్శనీయం", "షరీఫ్‌ భాయ్ అచ్చా హై... రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన మేం మీ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేం" అంటూ తుళ్లూరు, మందడం, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
Andhra Pradesh
Council
Shareef
Chairman

More Telugu News