Kodali Nani: బెదిరిస్తే లొంగిపోవడానికి ఆయనేమన్నా చంద్రబాబునాయుడా?: మంత్రి కొడాలి నాని

  • రాజధాని తరలించకూడదని సీఎం జగన్ ని బెదిరించాలట
  • కృష్ణా, గుంటూరు ప్రజాప్రతినిధులు ఆ పని చేయాలట!
  • మేము ఎందుకు బెదిరించాలి?
రాజధాని అమరావతిని తరలించకుండా ఉండాలంటే కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు సీఎం జగన్ ని బెదిరించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ, బెదిరిస్తే, బ్లాక్ మెయిల్ చేస్తే లొంగిపోవడానికి ఆయనేమన్నా చంద్రబాబునాయుడా? అయినా, మేము ఎందుకు బెదిరించాలి? అని ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకే రాజధానిని తరలిస్తున్నారన్న వాదనను నమ్మొద్దని, చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే పత్రికలు ఈవిధమైన ప్రచారం చేస్తున్నాయని అన్నారు.

విశాఖలో నాలుగో ఐదు ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్, థియేటర్లు, స్టూడియోలు, గీతం విద్యా సంస్థ..ఇలా చెప్పుకుంటూ పోతే చాలామటుకు తమ సామాజిక వర్గానికి చెందిన వారివే ఉన్నాయని, ఈ రకంగా చూస్తే తమకు అమరావతి, విశాఖ రెండు రాజధానులు వచ్చాయన్న కొడాలి మాటలకు సభ్యులు నవ్వులు చిందించారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకేమీ రాజధానిని తరలించడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. జగన్ కు అదే ఉద్దేశం కనుక ఉంటే రాజధానిని కడపకో, కర్నూలుకో, నెల్లూరుకో, ఒంగోలుకో లేకపోతే దొనకొండకో తరలించేవారని అన్నారు.

రాజకీయంగా బతకాలంటే కమ్మ సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబునాయుడుకి ఉందని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన్ని అడ్డం పెట్టుకుని జలగలులా పీక్కుతినే అవకాశం బాబుకు వత్తాసు పలికే పత్రికాధిపతులకు ఉందని ఆరోపించారు. ఇప్పుడు ఆ పత్రికాధిపతులకు ఇబ్బందికర పరిస్థితి ఉంది కనుక రాజధాని తరలింపు అంశాన్ని జాతి ప్రయోజనాలు దెబ్బతింటాయనే కోణంలో తమ పత్రికల్లో, ఛానెల్స్ లో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Kodali Nani
Minister
Chandrababu
Telugudesam

More Telugu News