Divya vani: ఆరోజు ఆడవాళ్లను ముందర పెట్టుకుని ఓట్లు అడుక్కున్నది ఎవరు?: రోజాకు దివ్యవాణి కౌంటర్

  • ‘రాజన్న బాణాన్ని’ అని చెప్పించుకుని ఓట్లు అడుక్కోలేదూ!
  • నోరుంది అని ఇష్టానుసారం మాట్లాదొద్దు
  • ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మనసు ఎలా అంగీకరిస్తోంది? 
రాజధాని అమరావతి ప్రాంతంలో ఆడవాళ్లను ముందు పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారంటూ టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఆరోజు ఆడవాళ్లను తమ ముందు పెట్టుకుని ఓట్లు అడుకున్నది ఎవరు? ‘రాజన్న బాణాన్ని’, ‘జగనన్న చెల్లెలిని’ అని చెప్పించుకుని ఓట్లు అడుక్కున్నారని విమర్శించారు. ఆడవాళ్లను ముందుపెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు చేయడానికి మనసు ఎలా అంగీకరిస్తోంది? అని రోజాను ప్రశ్నించారు. నోరుంది కదా అని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు.

అమరావతిని బతికించగల నాయకుడు చంద్రబాబే
 
అమరావతిలో పోరాడేందుకు మగవాళ్లు ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించిన రోజాపై దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒకే ఒక్క మగాడు’ గా చంద్రబాబునాయుడు ఉన్నారని, అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా పోరాడుతున్నారని, అమరావతిని బతికించగల నాయకుడు చంద్రన్న మాత్రమేనని అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆమె విమర్శలు చేశారు. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి సలహాలు తీసుకుని, ఆ సలహాలతో పరిపాలన చేయడాన్ని ‘పరిపాలన’ అని అనరని విమర్శించారు. రాష్ట్రాన్ని పరిపాలించాలంటే సత్తా ఉండాలని అన్నారు.
Divya vani
Telugudesam
Roja
YSRCP

More Telugu News