Andhra Pradesh: సీఎం జగన్ నుంచి ఆదేశాలు వచ్చాయి... ఏ ఒక్కరినీ వదలబోము: ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ కౌశల్

  • ఖజానాకు రూ. 300 కోట్ల నష్టం
  • 123 మంది నిందితుల కోసం గాలింపు
  • మైనింగ్ మాఫియాను వదిలేది లేదన్న సిద్ధార్థ కౌశల్

ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 300 కోట్ల నష్టాన్ని కలిగించిన మైనింగ్ మాఫియా కేసులో ఎవ్వరినీ వదలవద్దని సీఎం జగన్ నుంచి ఆదేశాలు అందాయని, ఈ కేసులో ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశామని, మరో 123 మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరు పరిచిన ఆయన, ప్రభుత్వాన్ని ఎలా మోసం చేశారో తెలిపారు. ముంబై మాఫియాను తలపించేలా వీరి ఆగడాలు సాగాయని, సీబీఐ విచారణ అవసరం లేకుండా, తామే అందరు నిందితుల గుట్టు విప్పుతామని తెలిపారు.

కాగా, అద్దంకి స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వీపీ శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నకిలీ ఫరంలను సృష్టించి, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా వీరంతా దందాను నడిపించారని సిద్ధార్థ కౌశల్ తెలియజేశారు. మొత్తం రూ. 290.49 కోట్ల వ్యాపారం చేసిన వీరు, ప్రభుత్వానికి రూ. 52.20 కోట్ల పన్ను ఎగ్గొట్టారని పేర్కొన్నారు. ఫరంలన్నింటినీ, తప్పుడు చిరునామాలతో ఆన్‌ లైన్‌ లో సృష్టించారని తేలిందన్నారు. ఒన్‌ మ్యాన్‌ ఫ్రీ బిజినెస్‌ పాలసీని వీరు దుర్వినియోగం చేశారని అన్నారు.

తొలుత మార్టూరు పోలీసులు కేసును ఛేదించడం ప్రారంభించారని, ఇదో పెద్ద మాఫియా అని అర్థమైన తరువాత, చీరాల, అద్దంకి, ఇంకొల్లు, మేదరమెట్ల పోలీసు అధికారులతో సిట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. నిందితుల నుంచి రాజకీయ నాయకులు, అధికారులకు లోడుకు రూ. 6 వేల వరకూ అందేదని అన్నారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని తెలిపారు.

More Telugu News