Pawan Kalyan: ఎందుకీ కాలయాపన.. కేసులు పెట్టొచ్చుగా: ఏపీ ప్రభుత్వానికి పవన్ సూచన

  • ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ కాలయాపన
  • నేనెప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదు
  • బలవంతంగా భూములు సేకరిస్తే ఉద్యమం తప్పదని మాత్రమే చెప్పా
తాను అమరావతిని వ్యతిరేకించానంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. అదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. తానెప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదని, బలవంతంగా భూములు సేకరిస్తే ఉద్యమిస్తానని మాత్రమే చెప్పానని గుర్తు చేశారు. రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమా? అని మాత్రమే ప్రశ్నించానని జనసేనాని పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించానని అన్నారు.

అప్పట్లో అమరావతి నిర్మాణానికి నేతలు, ప్రజలు మద్దతు తెలిపారని, ఇప్పుడు ఏర్పాటు చేస్తామన్న రాజధానికి కూడా వారందరి మద్దతు ఉండాలని పవన్ అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే, రాజధానిపై వైసీపీ నేతలు చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని పవన్ అన్నారు. టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ నేతలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని పవన్ విమర్శించారు. అలాంటి ఆరోపణలు చేస్తూ రోజులు గడిపేయడానికి బదులు అమరావతిలో అక్రమాలు చేసిన వారిపై కేసులు పెట్టొచ్చు కదా..? అని పవన్ సూచించారు.  
Pawan Kalyan
Amaravati
YSRCP

More Telugu News