Mohan Babu: ఎలాంటి సాయం కావాలన్నా చేస్తా... ఆ రోజున మాత్రం నన్ను పిలవకండి: మోహన్ బాబు

  • మా డైరీ ఆవిష్కరణ రసాభాస
  • రాజశేఖర్ పరుష వ్యాఖ్యలు
  • చిరంజీవి మండిపాటు
హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమం తీవ్ర ఆగ్రహాలకు, ఆవేశాలకు వేదికైంది. హీరో రాజశేఖర్ వ్యాఖ్యలతో చిరంజీవి, మోహన్ బాబు వంటి ఇండస్ట్రీ పెద్దలు నొచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.

దీనిపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు. సినిమా వాళ్లకు ఎలాంటి సాయం చేయాలన్నా ముందుండే టి.సుబ్బరామిరెడ్డి వంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఇంత రభస జరగడం బాధ కలిగిస్తోందని అన్నారు. 'మా'లో గొడవలు జరుగుతున్న మాట నిజమే కానీ తాము ఇవాళ ఇక్కడికి వచ్చింది నీతులు చెప్పడానికి కాదని అన్నారు.

అందరం ఒక తల్లిబిడ్డల్లాంటివాళ్లమేనని, 'మా'కు మళ్లీ ఎన్నికలు వస్తాయని, ఏదీ శాశ్వతం అనుకోరాదని తెలిపారు. 'మా' లో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడే సమయంలో చిరంజీవి తనను కూడా పిలుస్తానని చెప్పారని, కానీ ఆ రోజున తనను పిలవొద్దని మోహన్ బాబు సభాముఖంగా స్పష్టం చేశారు.

ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని, తాను ఎవరితోనూ పోరాడాలని అనుకోవడంలేదని తన వైఖరి వెల్లడించారు. రాజశేఖర్ అన్నా తనకు ఇష్టమేనని, ఆ కుటుంబం అంటే తనకు అభిమానమని చెప్పారు. అంతకుముందు ఆయన వేదికపై ఉన్న సీనియర్ నటుడు కృష్ణంరాజును తాత అని, తన సమకాలికుడు మురళీమోహన్ ను బావ అని సంబోధిస్తూ, పేరుపేరునా నమస్కారం చేశారు.
Mohan Babu
MAA
Chiranjeevi
Rajasekhar
Tollywood

More Telugu News