BSNL: నకిలీ చెక్ లతో బీఎస్ఎన్ఎల్ ను రూ. 24 లక్షలకు ముంచేశారు!

  • అధికారిక ఖాతా నుంచి నకిలీ చెక్ లు
  • ఆలస్యంగా గుర్తించిన అధికారులు
  • ఒకే నంబర్ తో రెండేసి చెక్ లు బ్యాంకుకు
  • పోలీసులకు అధికారుల ఫిర్యాదు

ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిక ఖాతా నుంచి నకిలీ చెక్ ల ద్వారా రూ. రూ. 24 లక్షలు డ్రా చేసుకున్నట్టు తేలింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కేజీ మార్క్‌ సమీపంలోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో బీఎస్‌ఎన్‌ఎల్‌ చెక్కుల పేరిట అక్రమంగా నగదును విత్ డ్రా చేసినట్టు అధికారుల విచారణలో తేలింది. నకిలీ చెక్కులను బ్యాంకుకు అందించిన అక్రమార్కులు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కు కుచ్చు టోపీ పెట్టారు. ఈ తంతును లేట్ గా గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అఫీషియల్ గా సంస్థ నుంచి ఎటువంటి చెక్కులనూ జారీ చేయలేదని, అయినప్పటికీ, సంస్థ ఖాతా నుంచి డబ్బు మాయమైందని బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ మేనేజర్‌ లీలా రామ్‌ మీనా ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై బ్యాంకు అధికారులను సంప్రదించామని, తమ డబ్బును తిరిగి తమ ఖాతాలో వేయాలని కోరగా, బ్యాంకు అధికారులు నిరాకరించారని చెప్పారు.

గడచిన నవంబర్ నెల 21న రూ. 66,505 చెక్‌ ను తామిచ్చామని, అది మాత్రం లబ్దిదారులకు చేరిందని ఆయన అన్నారు. తాము జారీ చేయని మూడు చెక్కులను తమకు చెప్పకుండానే బ్యాంకు క్లియర్ చేసిందని ఆయన ఆరోపించారు. దీంతో సంస్థకు రూ. 24,25,635 నష్టం చేకూరిందని చెప్పారు. ఇప్పటికే దీనిపై కేసును నమోదు చేశామని అన్నారు.

కాగా, ప్రాథమిక విచారణ తరువాత, ఒకే నంబర్ తో బ్యాంకు నుంచి రెండేసి చెక్కుల చొప్పున బ్యాంకుకు అందాయని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News