YSRCP: విజయసాయిరెడ్డి గారూ, ముదపాక వెళ్లి అధికారులతో ఎందుకు సర్వే చేయించారు?: టీడీపీ నేత బండారు

  • ల్యాండ్ ఫూలింగ్ కు మళ్లీ ఎందుకు జీవో తీసుకువచ్చారు?
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ మీరు చేయడం లేదా?
  • విశాఖ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ ఎంక్వయిరీ వేయాలి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి నిప్పులు చెరిగారు. విశాఖపట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనపై, తమ కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు చేస్తున్న విజయసాయిరెడ్డి ముదపాక వెళ్లి అధికారులతో ఎందుకు సర్వే చేయించారు? ల్యాండ్ ఫూలింగ్ కు మళ్లీ ఎందుకు జీవో తీసుకువచ్చారు? ముదపాక ల్యాండ్ పూలింగ్ లో తమను తప్పుబట్టిన మీరు మళ్లీ ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టారు? ఇన్ సైడర్ ట్రేడింగ్ మీరు చేయడం లేదా? అంటూ విరుచుకుపడ్డారు.

ఆశీలమెట్ట మీద ఉన్న క్రిస్టియన్ మిషనరీ స్థలంలో భాగస్వాములు ఎవరు ఉన్నారు? భవిష్యత్ లో అక్కడ నిర్మించబోయే అతిపెద్ద హోటల్ ఎవరి పేరు మీద రాబోతోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎదుటి వాళ్లకు చెప్పేందుకేనా నీతులు ఉంది? మా పై బురదజల్లుతారా మీరు? అంటూ విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో స్వచ్ఛమైన నాయకుడిలా విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని, ముదపాకలోనే కాదు భీమునిపట్నం ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ లకు సంబంధించి చాలా జీవోలు తెచ్చారని మండిపడ్డారు.

‘మీ పేపర్, మీ ఛానెల్ వున్నాయని చెప్పి మాపై బురదజల్లుతారా? నలభై, యాభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మమ్మల్ని, మా కుటుంబాలను రోడ్డుపైకి లాగుతారా?’ అంటూ విజయసాయిరెడ్డిని తూర్పారబట్టారు. దొంగతనం, చీటింగ్ వ్యవహారాల్లో తాము ఎప్పుడూ పోలీస్ రికార్డుల్లోకి ఎక్కలేదని, అలాంటిది తమను బదనామ్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ జీవోలు ఎందుకు తీసుకువచ్చారో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

వైసీపీ నేతలు చేస్తోంది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా? ఈ వారం రోజుల్లో మీ మనుషులు విమానాల్లో, రైళ్లలో ఎంత మంది దిగారో సీఎం జగన్ కు ధైర్యం ఉంటే లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. పరవాడలో జగన్ మనుషులు తిరుగుతున్నారని, ఈ మధ్యలో ఎప్పుడూ లేనంత హడావుడి ఈ పదిరోజుల్లోనే ఎందుకొచ్చింది? ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా? అని ప్రశ్నించారు. విశాఖ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని, ల్యాండ్ పూలింగ్ జీవోను వెంటనే ఆపాలని టీడీపీ తరఫున డిమాండు చేస్తున్నామని అన్నారు.
YSRCP
mp
Vijayasaireddy
Telugudesam
Bandaru satyanarayana murthy
Mudapaka
Vizag

More Telugu News