Jagan: జగన్ అన్నా.. నీ గోయి నువ్వు తవ్వుకోవద్దు: కేశినేని నాని
- ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో కలిశారు
- ప్రజా ఉద్యమాలను పోలీసులే కాదు ఎవరూ అణచలేరు
- అమరావతి నుంచి రాజధానిని మార్చొద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. విజయవాడలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం నానిని పోలీసులు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. అమరావతి రాజధాని ప్రాంత రైతులు కొనసాగిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీనిపై కేశినేని నాని ట్విట్టర్ ద్వారా స్పందించారు.
'జగన్ అన్నా.. ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో కలిసి పోయారు. ప్రజా ఉద్యమాలను పోలీసులే కాదు ఎవరూ అణచలేరు. అమరావతి నుంచి రాజధాని మార్చి నీ గోయి నువ్వు తవ్వుకోవద్దు' అని కేశినేని నాని విమర్శలు గుప్పించారు. తమ నివాసం వద్ద పోలీసులు ఉన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.