నేడు తండ్రి సమాధి వద్దకు వైఎస్ జగన్... కడప జిల్లాలో రెండో రోజు పర్యటన వివరాలు!

కడప జిల్లాలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, నేడు ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించనున్నారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకునే జగన్, అక్కడ నివాళులు అర్పించనున్నారు.

ఆపై మధ్యాహ్నం 12 గంటల వరకూ అక్కడికి సమీపంలోనే ఉన్న చర్చిలో జరిగే ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాయచోటి చేరుకుని, అక్కడి జూనియర్ కాలేజీ ఆవరణలో రూ. 3 వేల కోట్ల అంచనాతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి పులివెందులకు చేరుకుని, అక్కడే రాత్రికి బస చేస్తారు. రేపు కూడా జగన్ పర్యటన కడప జిల్లాలోనే సాగనుంది. 


More Telugu News