Chandrababu: 2014లో జగన్ చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించిన చంద్రబాబు

  • అమరావతి రైతుల మహాధర్నా
  • రైతులకు చంద్రబాబు మద్దతు
  • తుళ్లూరులో చంద్రబాబు ప్రసంగం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అమరావతిలో మహాధర్నా నిర్వహిస్తున్న రాజధాని రైతులకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మధ్యాహ్నం తుళ్లూరు వచ్చిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  అమరావతిని దానిపాటికి దాన్ని వదిలేస్తే, రోడ్లు, ఇతర భవనాల నిర్మాణానికి ఇక్కడ ఉండే ఆస్తిపై వచ్చే ఆదాయమే సరిపోతుందని అన్నారు.  రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క రూపాయి అవసరంలేని విధంగా తాము ప్రణాళికలు రచిస్తే, వాటిని అమలు చేయకుండా, డబ్బులు లేవంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన సెప్టెంబరు 4, 2014లో  వైఎస్ జగన్ అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు.

"ఆ రోజు అసెంబ్లీలో అమరావతి అంశంపై చర్చ జరిగింది. జగన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.... అధ్యక్షా, విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు చేయడాన్ని మేం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే, మన రాష్ట్రం 13 జిల్లాలతో చిన్న రాష్ట్రంగా మారిపోయింది. ఇంత చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టడం ఇష్టలేక, రాజధానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. మేం మొదటినుంచి చెప్పేదొక్కటే, మీరు క్యాపిటల్ సిటీని ఎక్కడైనా ఏర్పాటు చేయండి కానీ, అక్కడ కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని చెబుతున్నాం... సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డిగారి స్టేట్ మెంట్ ఇది. నేనడుగుతున్నా, ఎందుకు మాట తప్పారు? ఎందుకు మడమ తిప్పారు?


ఇది మీరు చెప్పిన మాట కాదా. ఇప్పుడు 200 ఎకరాలు సరిపోతుందని, 500 ఎకరాలు సరిపోతుందని అంటారా? ఎందుకు అమరావతిపై అపవాదులు వేస్తున్నారు? దేనికోసం? మీరే చెప్పారు 30 వేల ఎకరాలు కావాలని. ఇక్కడ రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేశారు. అలాంటి చోట ఆరోపణలు చేస్తారా? మేమే బినామీ యాక్ట్ తీసుకువచ్చాం, మీకు దమ్ముంటే జ్యుడిషయల్ విచారణ జరిపించి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించాలి! అవినీతికి ఎవరు పాల్పడినా శిక్షించాల్సిందే. కానీ అవినీతి పేరు చెప్పి అమరావతిని చంపేయాలనుకోవడం అన్యాయం, దుర్మార్గం.

దమ్ముంటే హైకోర్టు ద్వారా కమిటీ వేసుకోండి. మీరు నియమించుకునే వ్యక్తులు వద్దు. వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. స్పీకర్ దీన్ని ఎడారి అంటారు, మరొకాయన శ్మశానం అంటాడు. బంగారం పండే భూమి ఇది. రైతులు త్యాగాలు చేసి ఇచ్చిన భూమి ఇది. మరొకరు ఇది మునిగిపోతుందంటాడు. చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదు. రాజకీయాలు చేసుకోవాలంటే ఎలక్షన్ల సమయంలో చేసుకుందాం. నాకు కావాల్సింది అమరావతి" అంటూ ఉద్ఘాటించారు.
Chandrababu
Andhra Pradesh
Amaravathi
YSRCP
Jagan
Telugudesam

More Telugu News