minister puvvaada: ఆదర్శంగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులూ ఆర్టీసీలో ప్రయాణించాలి: తెలంగాణ మంత్రి పువ్వాడ

  • సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు అందరం తలోచెయ్యి వేయాలి 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్యక్రమానికి బస్సులో వచ్చిన అమాత్యుడు 
  • ఓఆర్ పెంచేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచన

ఆర్టీసీ సంస్థ లాభాల్లో ప్రయాణించాలంటే తెలంగాణలోని అన్ని వర్గాలు తమవంతు ప్రయత్నం చేయాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకు అంతా వీలైనంత ఎక్కువ బస్సులో ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ లతో కలిసి బస్సులో ప్రయాణించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్తుందని, సంస్థకు లాభం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు.

ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమైనదని, బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెంచి లాభాల్లోకి తీసుకురావడమే మనముందున్న కర్తవ్యమని చెప్పారు. అలాగే ఆర్టీసీ ద్వారా వస్తు రవాణా (కార్గో) సేవలు అందించే ప్రయత్నం కూడా జరుగుతోందని తెలిపారు.

minister puvvaada
TSRTC
Khammam
badradrikothagudem

More Telugu News