Chandrababu: అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే ప్రపంచం ఏమైపోతుందోనని బాధేస్తోంది: చంద్రబాబు సెటైర్లు

  • అవినీతి గురించి విలువలు ఉండే వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది
  • జగన్ తుగ్లక్ కార్యక్రమాలతో నష్టపోతున్నాం
  • అది ‘రివర్స్ టెండరింగ్’ కాదు ‘రిజర్వ్ టెండరింగ్’

అవినీతి గురించి సీఎం జగన్ మాట్లాడుతుంటే ప్రపంచం ఏమైపోతుందోనని తనకు బాధేస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సెటైర్లు వేశారు. అనంతపురంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, అవినీతి గురించి నీతివంతుడు, విలువలు ఉండే వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది తప్ప, ఇలాంటి వ్యక్తులు కాదంటూ జగన్ విమర్శలు చేశారు. మద్యపాన నిషేధం అంటూ సీఎం జగన్ చేసిన తుగ్లక్ కార్యక్రమాల వల్ల తెలంగాణలోని మద్యం మన రాష్ట్రానికి వస్తోందని, ఆదాయం అంతా ఆ రాష్ట్రానికి పోతోందని అన్నారు. ప్రభుత్వ సొమ్ము ఆదా చేస్తామంటూ తీసుకొచ్చింది ‘రివర్స్ టెండరింగ్’ కాదు..‘రిజర్వ్ టెండరింగ్’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం అధోగతిపాలవుతోందని, తిరోగమనం దిశగా పయనిస్తోందని మండిపడ్డారు.

 అభివృద్ధి జరిగిపోతుందనుకోవడం ఒట్టి భ్రమ

హైదరాబాద్ లో అసెంబ్లీ, సెక్రటేరియట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్స్, హైకోర్టు.. అన్నీ ఉన్నా ఐటీ రంగం, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, సైబరాబాద్ వచ్చిన తర్వాతే అది అభివృద్ధి చెందిందని చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ. ఈ విషయమై ప్రజలు ఆలోచించాలని సూచించారు. అమరావతి నుంచి హైకోర్టు, సెక్రటేరియట్ మొదలైన వాటిని మార్చడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని జగన్ చెబుతున్నారని, అయితే, అడ్మినిస్టేషన్ ను డిఫరెంట్ ప్లేసెస్ లో పెడితే అభివృద్ధి జరిగిపోతుందనుకోవడం ఒట్టి భ్రమ మాత్రమే అని విమర్శించారు.  

జగన్ కు తెలిసిందల్లా తప్పుడు లెక్కలు రాసి దొరికిపోవడమే

ఏపీ రాజధానిని విజయవాడలోనే పెట్టమని నాడు చెప్పిన జగన్, నిన్న అసెంబ్లీలో రకరకాల ప్రకటనలు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. నాడు తమ పాలనలో విశాఖను ఫైనాన్షియల్ హబ్ గా తయారు చేయాలని తాము అనుకుంటే అప్పటి ప్రతిపక్ష నేతలు అడ్డుపడ్డారని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ గురించి తెలియని వ్యక్తి జగన్ అని, ఆయనకు తెలిసిందల్లా ఒకటే ‘అడ్డంగా తప్పుడు లెక్కలు రాయడం.. దొరికిపోవడం. మీరు (జగన్) అవినీతిపరుడు కాబట్టి అందరూ అవినీతిపరులు అని కావాలని మాట్లాడుతున్నారు’ అంటూ విమర్శలు చేశారు.

More Telugu News