NRC: బెదిరింపులతో బిల్లులు ఆమోదించుకుంటున్నారు: సీతారాం ఏచూరి

  • పౌరసత్వ చట్టంపై విమర్శలు చేస్తే దేశద్రోహులా?
  • ఈ చట్టం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నట్టుగా ఉంది
  • జామియా వర్శిటీలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం
  పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలిపిన జామియా యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శలు చేశారు. ఢిల్లీలో విపక్ష పార్టీల నేతలు ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెదిరింపులతో బిల్లులు ఆమోదించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రాంతీయ పార్టీల మద్దతు లేకపోతే ఈ బిల్లు ఆమోదం పొందేది కాదని అన్నారు.

ఈ బిల్లుపై విమర్శలు చేసే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా యూనివర్శిటీలోకి పోలీసులు ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు. ఈ చట్టం ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై దాడి చేస్తున్నట్టుగా ఉందని, ఈ చట్టాన్ని నిరసిస్తూ దాదాపు అన్ని సెంట్రల్ యూనివర్శిటీల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, అన్నారు. జామియా వర్శిటీలో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని, ఈ ఘటనకు బాధ్యులెవరో గుర్తించి చట్టపరంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు.
NRC
cpi(m)
Sitaram Yechuri
central Universities

More Telugu News