Sangareddy District: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఎఫెక్ట్.. ఆత్మహత్య చేసుకున్న మరో నిందితుడు!

  • మరో యువకుడితో స్నేహంగా ఉన్న బాలిక
  • తట్టుకోలేక ఇంట్లోకి చొరబడి బాలిక గొంతు కోసి హత్య
  • బెయిలుపై బయటకు వచ్చి బీటెక్ చదువుతున్న నిందితుడు
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత నిందితుల్లో వణుకుపుడుతోందా? తాజా ఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సిద్ధిపేట జిల్లాలో భార్యా పిల్లలపై టర్పంటైన్ పోసి నలుగురిని సజీవ దహనం చేసిన కేసులో నిందితుడైన లక్ష్మీరాజ్యం ఎన్‌కౌంటర్ భయంతో ఇటీవల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా, సంగారెడ్డి జిల్లాలో స్నేహితురాలిని గొంతు కోసి చంపిన కేసులో నిందితుడైన జాదవ్ అరవింద్ (23) కూడా ఉరివేసుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా వాగాలకు చెందిన అరవింద్ తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడీఏ బొల్లారంలో ఉంటున్నాడు. పదో తరగతి చదువుతున్న స్థానిక బాలికను ప్రేమించిన నిందితుడు.. ఆమె వేరే యువకుడితో చనువుగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. గతేడాది ఆగస్టు 30న ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

 ఈ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ ఆపై బెయిలుపై బయటకు వచ్చాడు. ప్రస్తుతం నాందేడ్‌లోని ఓ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత తనకూ అటువంటి శిక్ష తప్పదని భావించిన అరవింద్ సోమవారం ఉదయం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sangareddy District
Accused
suicide

More Telugu News