Kodali Nani: ఉల్లి కోసమే వెళ్లి మరణించారని చెప్పాలని సాంబిరెడ్డి కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు: కొడాలి నాని

  • సాంబిరెడ్డి మృతి చెందడానికి, ఉల్లికి సంబంధం లేదు
  • ఆయన మృతిపై ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది
  • సాంబిరెడ్డి కుటుంబం అర్థికంగా ఉన్నత స్థితిలో ఉంది
  • ఉల్లిపాయల కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు
కృష్ణా జిల్లాలోని గుడివాడ రైతు బజార్‌లో ఉల్లిపాయల కోసం క్యూ లైన్లో నిల్చొని సాంబిరెడ్డి అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులను ఏపీ మంత్రి కొడాలి నాని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

సాంబిరెడ్డి మృతి చెందడానికి, ఉల్లిపాయలకు సంబంధం లేదని కొడాలి నాని చెప్పారు. ఉల్లి కోసమే వెళ్లి సాంబిరెడ్డి మరణించాడని చెప్పాలని ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆయన మృతిపై ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని, సాంబిరెడ్డి కుటుంబం అర్థికంగా ఉన్నత స్థితి లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఇద్దరు కుమారులు హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లని తెలిపారు. అంతేగాక, గుడివాడలో మూడు అంతస్తుల భవనం నిర్మించుకున్నారని అన్నారు. 15 ఎకరాల్లో వ్యవసాయ చేసుకుంటున్న ఆయన.. సబ్సిడీకి వచ్చే ఉల్లిపాయల కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన అవసరం లేదని నాని చెప్పారు.  

ఉల్లి కోసం సాంబిరెడ్డి క్యూలైన్ లో నిలబడి తొక్కిసలాటలో మరణించలేదని కొడాలి నాని అన్నారు. గుండెపోటుతోనే ఆయన మరణించారని స్వయంగా ఆయన కుటుంబసభ్యులు చెప్పారని, అయినప్పటికీ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
Kodali Nani
Andhra Pradesh
YSRCP

More Telugu News