New Delhi: మరో రెండు నిమిషాల్లో చనిపోబోతున్నా.. నా కుటుంబం జాగ్రత్త: ఢిల్లీ అగ్ని ప్రమాద మృతుడి చివరి కాల్!

  • చనిపోయే ముందు సోదరుడికి ఫోన్
  • తప్పించుకునే మార్గం లేదని ఆవేదన 
  • విషయం ఇంట్లో చెప్పాలంటూ వేడుకోలు
ఢిల్లీ అగ్నిప్రమాదంలో మృతి చెందడానికి ముందు ఓ కార్మికుడు చేసిన చివరి ఫోన్‌కాల్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఢిల్లీలో నిన్న ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 43 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఓ కార్మికుడు చనిపోయే ముందు తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడిని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన ముషారఫ్ అలీ (30)గా గుర్తించారు.

ఆ ఫోన్‌ కాల్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘అన్నయ్యా.. నా చుట్టూ మంటలు దట్టంగా అలముకున్నాయి. మరికాసేపట్లో నేను చనిపోబోతున్నా. మహా అయితే, మరో రెండు మూడు నిమిషాలు అంతే. తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. నేను బతికే అవకాశం ఎంతమాత్రమూ లేదు. దేవుడి దయ ఉంటే తప్ప బతికి బయటపడడం అసాధ్యం. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. రేపు వచ్చి నా మృతదేహాన్ని తీసుకెళ్లు. నేను చనిపోయినట్టు ఇంట్లో పెద్దలకు కూడా చెప్పు’’ అంటూ అతడు మాట్లాడిన ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. ఇది విన్నవారి హృదయాలు ద్రవించుకుపోతున్నాయి. ముషారఫ్ అలీ నాలుగేళ్లుగా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు.
New Delhi
Fire Accident
worker
phone call

More Telugu News