Chittoor District: లిఫ్ట్ పేరుతో బాలికపై యువకుల అత్యాచారం.. చిత్తూరు జిల్లాలో ఘటన

  • గత నెల 24న ఘటన
  • స్నేహితుడికి ఫోన్ చేసి పిలిపించి మరీ అఘాయిత్యం
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
లిఫ్ట్ పేరుతో ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. గత నెల 24న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..  ఇంట్లో గొడవ పడిన ఓ బాలిక (16) అలిగి తిరుపతికి చేరుకుంది. అదే రోజు రాత్రి  తిరుపతి పద్మావతీపురం నుంచి కాలినడకన తిరుచానూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో చిత్తూరుకు చెందిన వెంకటేశ్ (31) బైక్‌పై వస్తూ కనిపించడంతో లిఫ్ట్ అడిగింది. సరేనన్న అతడు ఆమెను ఎక్కించుకున్నాడు. అయితే, తిరుచానూరులో ఆమెను దింపకుండా  ముళ్లపూడి వరకు తీసుకెళ్లాడు.

అక్కడ బైక్ ఆపి పెట్రోలు అయిపోయిందని చెప్పి ఆమెను నమ్మించిన వెంకటేశ్.. స్నేహితుడైన  బుక్కే రాజమోహన్‌నాయక్‌ (28)ను పెట్రోల్‌ తీసుకురమ్మని ఫోన్ చేసి చెప్పాడు. అతడు రాగానే ఇద్దరూ కలిసి బాలికను బలవంతంగా రోడ్డు పక్కనున్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన బాలిక పెద్దగా కేకలు పెట్టడంతో స్థానికులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. వారి రాకను గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తల్లిదండ్రులకు విషయం చెప్పిన బాలిక వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. రాజమోహన్‌నాయక్‌ ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Chittoor District
Andhra Pradesh
rape

More Telugu News