Fire Accident: ఇటీవలి కాలంలో అతిపెద్ద అగ్ని ప్రమాదం... 43కు చేరిన మృతుల సంఖ్య... ప్రధాని దిగ్భ్రాంతి!

  • అనాజ్ మండీలోని ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
  • గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమం
  • సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్న ప్రధాని
దేశ రాజధానిలోని అనాజ్ మండీ సమీపంలోని కర్మాగారంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో క్షణక్షణానికీ మృతుల సంఖ్య పెరుగుతోంది. తొలుత 30 మంది వరకూ మరణించారని వార్తలు రాగా, ఇప్పుడు మృతుల సంఖ్య 43కు పెరిగింది. దట్టమైన పొగ ఫ్యాక్టరీలో అలముకోవడంతో ఊపిరి అందక అత్యధికులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి 50 మందిని అగ్నిమాపకశాఖ కాపాడగా, వారిలో పలువురు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, విచారణ ప్రారంభించామని ఉన్నతాధికారులు వెల్లడించారు. మంటలను అదుపు చేయడానికి 30 వరకూ ఫైర్ ఇంజన్లు శ్రమిస్తున్నాయని తెలిపారు.
Fire Accident
New Delhi
Narendra Modi

More Telugu News