Hyderabad: హైదరాబాద్ లో అదృశ్యమైన యువతి... డిండి ప్రాజెక్టులో విగతజీవిగా..!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లో గత నెల 25న అదృశ్యమైన మేగావత్ ప్రియాంక (17) మృతదేహం, మహబూబ్ నగర్ జిల్లా డిండి ప్రాజెక్టులో లభ్యం కావడంతో కలకలం రేగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అచ్చంపేట మండలానికి చెందిన సత్తమ్మ, వెంకటేశ్‌ లు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి, వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటుండగా, వారి చిన్న కుమార్తె ప్రియాంక లాల్‌ బజార్‌ లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. 25న కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంలో మూడు రోజుల పాటు వెతికిన తల్లిదండ్రులు, 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, అంతకు ఒకరోజు ముందే డిండి ప్రాజెక్టులో యువతి మృతదేహం కనిపించడంతో, ఉప్పునూతల పోలీసులు కేసు నమోదు చేశారు. మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్న క్రమంలో ప్రియాంక విషయం తెలిసి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి, మృతదేహాన్ని గుర్తు పట్టడంతో, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ఆమె ఒంటిపై గాయాలు లేవని, ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి మృతి చెందిందని వైద్యులు తేల్చడంతో, ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా నీళ్లలోకి తోసేశారా? అన్న కోణంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Missing
Dindi Project
Dead Body
Priyanka

More Telugu News