Chandrababu: ఒక్క ఆగస్టులోనే 5 సార్లు అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?: వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రశ్న
- పాలించడం చేతకాకపోతే సలహాలు తీసుకోండి
- ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపితే ఎలా?
- 6 నెలల్లో రూ. 25 వేల కోట్ల అప్పులు చేశారు
పాలించడం చేతకాకపోతే సలహాలు తీసుకోవాలంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఓ వైపు భారీ ఎత్తున అప్పులు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం... మరోవైపు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానంటూ తిరిగి తనపైనే ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపితే ఎలాగని ప్రశ్నించారు.
ఈ 6 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఏదైనా సాధించిందంటే... అది అప్పుల్లో రికార్డు సృష్టించడమేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గత 6 నెలల్లో రూ. 25 వేల కోట్లు అప్పులు చేశారని... అంటే నెలకు దాదాపుగా మూడున్నర వేల కోట్ల అప్పులు చేశారని... కానీ, ఒక్క అభివృద్ధి పనిని కూడా చేపట్టలేదని విమర్శించారు. ఒక్క ఆగస్టు నెలలోనే 5 సార్లు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.