Chandrababu: చంద్రబాబు పక్కన కూర్చున్నవాళ్లు ఎవరో వైసీపీ సైకోలకు తెలియదు: నారా లోకేశ్

  • వైసీపీ నేతలపై లోకేశ్ విమర్శలు
  • చంద్రబాబు పర్యటనతో వైసీపీ చీప్ ట్రిక్స్ కు తెరపడిందని వ్యాఖ్యలు
  • కొత్త కథ అల్లారంటూ ఆరోపణ
వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ విద్వేష మనస్తత్వంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఈ ఆరు నెలల్లో ఏం చేశారో చెప్పుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్న వైసీపీ నాయకులు మరోసారి కుల రాజకీయాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.

అమరావతి గ్రాఫిక్స్ అంటూ చిల్లర రాజకీయాలు చేశారని, ఇప్పుడా చవకబారు ఎత్తుగడలకు చంద్రబాబు అమరావతి పర్యటనతో తెరపడిందని పేర్కొన్నారు. దాంతో దిక్కుతోచని స్థితిలో పడిన వైసీపీ నేతలు కొత్త కథ అల్లారని, ఎస్సీలను కిందకూర్చోబెట్టి అవమానిస్తారా అంటూ వారి అసలైన గ్రాఫిక్ నైపుణ్యం చూపిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.

వాస్తవానికి చంద్రబాబు పక్కన కూర్చున్నవాళ్లంతా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందినవారేనని, పాపం ఈ విషయం వైసీపీ సైకోలకు తెలియదు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ జగన్ గారి పేటీఎం బ్యాచ్ అవగాహన రాహిత్యానికి నా సానుభూతి అంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.  

చంద్రబాబు ఎస్సీలను అవమానించారని, జగన్ ఎస్సీలను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని పోల్చి చూపుతూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ ఫొటోపై లోకేశ్ పైవిధంగా స్పందించారు.
Chandrababu
Telugudesam
YSRCP
Nara Lokesh
Jagan

More Telugu News