Chandrababu: నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన బాబుకు నేడు అదే జరిగింది!: మంత్రి పేర్నినాని
- ఏ జన్మలో పాప పుణ్యాలను ఆ జన్మలోనే అనుభవించాలి
- కుక్కకున్న విశ్వాసంలో బాబుకు పది శాతం కూడా లేదు
- అమరావతిలో చంద్రబాబు రాజకీయ యాత్ర చేశారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పిల్లను, పదవిని, హోదాను ఇచ్చిన తన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర చంద్రబాబుదని ఆరోపించారు.
ఏ జన్మలో చేసిన పాప పుణ్యాలను ఆ జన్మలోనే అనుభవించేలా భగవంతుడు చేస్తాడని, అందుకే, నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన చంద్రబాబుపై నేడు అమరావతిలో అదే జరిగిందని, రైతుల రూపంలో వచ్చిన ఎన్టీఆరే చంద్రబాబుపై చెప్పులు వేయించారని అన్నారు. ఎన్టీఆర్ నుంచి ఎన్నో పొందిన చంద్రబాబుకు.. కుక్కకు ఉన్న విశ్వాసంలో పది శాతం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి పర్యటనకు వెళ్లిన తన కాన్వాయ్ పై వైసీపీ దాడి చేయించిందని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు చెప్పారు. సీఎం జగన్ కీర్తి ముందు, ఆయన చేస్తున్న మంచి పనుల ముందు తన కుమారుడు లోకేశ్ రాజకీయ జీవితం ఎక్కడ ఆవిరి అయిపోతుందోనన్న భయంతో, తన కేడర్ ను కాపాడుకోవడం కోసమే అమరావతిలో చంద్రబాబు రాజకీయ యాత్ర చేశారని విమర్శించారు.