Narendra Modi: ప్రజల మనసుల్లో నుంచి ఆ భావన తుడిచిపెట్టాం: మోదీ

  • ఆర్టికల్ 370 శాశ్వతమనుకున్నారు
  • జీఎస్టీ కారణంగా వస్తువుల ధరలు తగ్గాయి
  • లక్షన్నర కోట్ల రూపాయలను వృథా కాకుండా అడ్డుకున్నాం
భారతీయులు జీవితకాలంలో చూడలేమనుకున్న ఎన్నో అంశాలను తాము సాకారం చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆర్టికల్ 370 శాశ్వతమన్న భావన ప్రజల్లో ఉండిపోయిందని, అది నిజం కాదని తాము నిరూపించామని అన్నారు. కొన్ని కుటుంబాల రాజకీయ స్వార్థం వల్లే అటువంటి భావన ఏర్పడిందన్నారు. రిపబ్లిక్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రిపబ్లిక్ సమ్మిట్‌’లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముస్లిం మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ట్రిపుల్ తలాక్‌ను నిషేధించామని అన్నారు. ఆధార్ విషయంలో కొందరు అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నించారని, దీనిని అడ్డుకుని లక్షన్నర కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా కాకుండా నిలువరించామని చెప్పారు. జీఎస్టీ కారణంగా 99 శాతం వస్తువులు తక్కువ ధరకే దొరుకుతున్నాయన్నారు. దేశంలోని ఏడుకోట్ల మంది ప్రజల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించామన్నారు. దేశ శ్రేయస్సే తమకు ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు.
Narendra Modi
article 370
triple talaq

More Telugu News