Andhra Pradesh: తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసుపెడతాను.. నా కుల ధ్రువ పత్రాలు అధికారులకు ఇచ్చాను: ఎమ్మెల్యే శ్రీదేవి

  • తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదని ఫిర్యాదులు
  • ఈసీ ఆదేశాల మేరకు విచారణ
  • తన కుటుంబ సభ్యులకూ కుల ధ్రువపత్రాలున్నాయన్న శ్రీదేవి
గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా? కాదా? అనే విషయంపై వివాదం చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఆమె ఎస్సీ కాదని ఫిర్యాదులు రావడంతో దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈసీ ఆదేశాల మేరకు జేసీ దినేశ్ కుమార్ తో కూడిన బృందం చేపడుతున్న విచారణకు ఆమె హాజరయ్యారు. తనకు సంబంధించిన కుల ధ్రువపత్రాలన్నింటినీ తాను అధికారులకు అందించానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

తనకు, తన కుటుంబ సభ్యులకు హిందూ మాదిగ కుల ధ్రువపత్రాలున్నాయని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. తాను పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తున్నందుకే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఎప్పుడు పిలిచినా హాజరవుతానని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసుపెడతానన్నారు.
Andhra Pradesh
Guntur District
YSRCP

More Telugu News