Jagan: జగన్ గారికి ఇవన్నీ బాగా తెలుసు... ఇలాంటివాటిలో ముదిరిపోయారు: నారా లోకేశ్

  • రాజధాని ఇక్కడ ఉండడం జగన్ కు ఇష్టంలేదన్న లోకేశ్
  • అందుకే ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని వెల్లడి
  • ఆరోపణలు చేసి, నిరూపించలేని దద్దమ్మలు అంటూ మండిపాటు 
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రాజధాని అనేది ఇక్కడ ఉండకూడదన్నది జగన్ ఆలోచన అని తెలిపారు.

8 వేల ఎకరాలకు 'ఇన్ సైడర్ ట్రేడింగ్' జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తూ రాజధానిని తరలించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు. అందుకోసం 'ఇన్ సైడర్ ట్రేడింగ్' అనే పదం ఉపయోగిస్తున్నారని, వీటన్నింటినీ 'వైట్ కాలర్' నేరాలంటారని, ఇలాంటివి జగన్ కు బాగా తెలుసని అన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఆయన ముదిరిపోయారని లోకేశ్ ఎద్దేవా చేశారు.

రాజధానికి అమరావతిని అని నామకరణం చేసి, ప్రజారాజధానిగా అభివృద్ధి చేయాలని తలంచామని, అయితే, జగన్ కావాలనే ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో అన్ని వర్గాలకు భూములున్నాయని, కానీ ఓ కులానికి చెందినవాళ్లకే అమరావతిలో భూములున్నాయని అసత్యప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఇక్కడ భూములున్నాయని ఆరోపణలు చేసి ఒక్కటీ నిరూపించలేకపోయారని, చేతకాని దద్దమ్మలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్నెల్లయినా ఒక్క ఆరోపణ నిజమని నిరూపించలేకపోయారని, తాను కోర్టులో పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Jagan
Nara Lokesh
Andhra Pradesh
Amaravathi
Telugudesam
YSRCP

More Telugu News