Crime News: తొలుత రెక్కీ.. ఆపై చోరీ: 30 తులాల బంగారం చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
- ఈ నెల 12న చోరీ
- తాళం బద్దలుగొట్టి 30 తులాల బంగారం, నగదు చోరీ
- రూ.11.60 లక్షల విలువైన బంగారం.. రూ.14,500 స్వాధీనం
తొలుత రెక్కీ నిర్వహించి, ఆపై చోరీకి పాల్పడే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌కు చెందిన రఘురామిరెడ్డి, లలితారెడ్డి దంపతులు. ఈ నెల 12న లలితారెడ్డి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చేసరికి తాళం బద్దలుగొట్టి ఉండడం కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా 30 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్టు గుర్తించింది. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి అపార్ట్మెంట్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడి ఆచూకీ లభించింది. ఈ నెల 11న అపార్ట్‌మెంట్‌కు వచ్చిన నిందితుడు రెండో అంతస్తులో సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజు మళ్లీ వచ్చి మూడో అంతస్తుకు వెళ్లాడు. తాళం వేసి ఉన్న లలితారెడ్డి ఇంటిని గమనించి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని కార్మికనగర్‌కు చెందిన మహ్మద్ మన్సూర్ (34)గా గుర్తించిన పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.11.60 లక్షల విలువైన బంగారు నగలు, రూ.14,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.