Pawan Kalyan: పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు నన్ను ఎగతాళి చేస్తున్నారు: పవన్ కల్యాణ్

  • జనసైనికులతో పవన్ కల్యాణ్ భేటీ
  • జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పుబడుతున్నారు
  • మీరు మాత్రం పవన్ నాయుడు అంటున్నారు
పవన్ నాయుడు అంటూ తనను వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరులోని  మంగళగిరిలో ఆయన జనసైనికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'జగన్ రెడ్డి అని నేను పిలిస్తే మాత్రం వారు తప్పుబడుతున్నారు. జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పేంటీ? అలా పిలిస్తే దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. నన్ను మాత్రం పవన్ నాయుడు అంటున్నారు' అని విమర్శించారు.

'వ్యక్తిగతంగా వారు ఎంతగా రెచ్చగొట్టినా నేను వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడను. వ్యక్తిగత నిందల వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేయడమే మా సిద్ధాంతం. ఐదు నెలల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఇసుక వారోత్సవాలు చేయడం సిగ్గుచేటు' అని పవన్ కల్యాణ్ అన్నారు.

'ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందన్న విషయంపైనే మేము దృష్టి పెడతాం. తెలుగు భాషను ప్రభుత్వం  విస్మరిస్తోంది. మనది తెలుగు జాతి అన్న భావన పోతుంది. ఏపీలో తెలుగును విస్మరిస్తున్నారు. దీని వల్ల తీవ్ర పరిణామాలుంటాయి' అని పవన్ వ్యాఖ్యానించారు.

'భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అటువంటిది మాతృభాషను చంపేస్తామంటున్నారు. ఇటువంటి పరిస్థితులను తీసుకువస్తున్నప్పటికీ కొందరు మేధావులు మౌనంగా ఉంటున్నారు. మేధావుల మౌనం సమాజానికి మంచిదికాదు. సంస్కృతులను కాపాడే తీరు సమాజంలో ఉండాలి' అని పవన్ అన్నారు.
Pawan Kalyan
YSRCP
Jagan

More Telugu News