Parvez Musharraf: భారత సైన్యంతో పోరాడేందుకు కశ్మీరీలకు పాకిస్థాన్ లో ట్రైనింగ్ ఇచ్చాం: సంచలన విషయాన్ని వెల్లడించిన ముషారఫ్

  • కశ్మీరీలకు పాక్ లో హీరో స్థాయిలో స్వాగత సత్కారాలు లభించాయి
  • భారత సైన్యంతో పోరాడే ముజాహిదీన్ లుగా వారిని గౌరవించాం
  • వారికి శిక్షణ ఇచ్చి, ఆయుధాలను అందించాం

జమ్మూకశ్మీర్ లో భారత సైన్యంతో పోరాడేందుకు కశ్మీరీలకు పాకిస్థాన్ లో ముజాహిదీన్ ట్రైనింగ్ ఇచ్చామంటూ పాక్ మాజీ అధ్యక్షుడు, ఆర్మీ మాజీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు, జిహాదీ టెర్రరిస్టులను పాకిస్థాన్ హీరోలుగా ఆయన అభివర్ణించారు. ఓ ఇంటర్వ్యూలో ముషారఫ్ చేసిన వ్యాఖ్యల క్లిప్ లను పాక్ రాజకీయవేత్త ఫర్హతుల్లా బాబర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ క్లిప్ లో ముషారఫ్ మాట్లాడిన మాటలు చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి.

'పాకిస్థాన్ కు వచ్చిన కశ్మీరీలకు ఇక్కడ హీరో స్థాయిలో స్వాగత సత్కారాలు అభించాయి. మేము వాళ్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా పూర్తి సహకారాన్ని అందించాం. వాళ్లను మేము భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడే ముజాహిదీన్ లుగా గౌరవించాం. ఆ సమయంలోనే లష్కరే తాయిబా వంటి ఉగ్ర సంస్థలు ఎదిగాయి. వాళ్లంతా మా హీరోలు' అంటూ ఆ క్లిప్ లో ముషారఫ్ వ్యాఖ్యానించారు.

ఒసామా బిన్ లాడెన్, జలాలుద్దీన్ హక్కానీలు కూడా పాక్ హీరోలేనని ముషారఫ్ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి సోవియట్లను (రష్యా) తరిమివేసేందుకు ఆ దేశంలో మతపరమైన మిలిటెన్సీని 1979లో తాము ప్రారంభించామని చెప్పారు. పాకిస్థాన్ కు లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతో అలా చేశామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముజాహీదీన్ లను తీసుకొచ్చి వారికి శిక్షణ ఇచ్చి, ఆయుధాలను అందించామని తెలిపారు. తాలిబన్లకు కూడా శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. అయితే, ఈ అంశాన్ని ప్రపంచమంతా వేరే కోణంలో చూడటం ప్రారంభించిందని... ఈ నేపథ్యంలో, తమ హీరోలంతా విలన్లుగా మారిపోయారని చెప్పారు.

More Telugu News